![]() |
సుఖ సంతోషాలకు, సరదా సంబరాలకు పండగలనేవి సూచికలు. మన హృదయాలు ఆనందంగా ఉండే కాలంలోనే మన పండుగలు (mana pandugalu) చేసుకో గలుగుతాం !
అసలు సృష్టి చక్రంలోనే ఈ పండుగల ఏవేవి ఎప్పుడెప్పుడు రావాలనేది నిర్ణయమైంది.
మనస్సు ఆహ్లాదంగా ఉండి, ప్రశాంతితో నిండి, పండిన పంట చేతికి అంది ఉత్సాహంగా ఉన్న రోజులను మనవాళ్లు ఏనాడో లెక్క గట్టి, వాటికి ఉత్సవాలు అనీ - పండగలనీ పేరు పెట్టారు.
తెలుగు మాసాలు - తిథుల వారీగా వచ్చే కొన్ని పండుగలు ; వివిధ మతాచారాల ప్రకారం జరుపుకునే కొన్ని పండుగలు ప్రతి ఏటా మనలను ఎలా పలకరిస్తాయో పరిశీలిద్దాం !
భోగి,సంక్రాంతి,కనుమ
తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు ; వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే ! కొందరు నాలుగవ రోజును ముక్కనుము కూడా పండగగా భావించే వారున్నారు.
దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధన ధాన్య రాశులు చేరతాయి.
పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది.
![]() |
మొదటి రోజు భోగి. మూల మూలల చెత్తా, పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి భోగి మంటలను వేసి ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి.
పంట చేతికొచ్చిన ఆనందంలో ఇళ్ళకు అల్లుళ్ళని - కూతుళ్ళని ఆహ్వానిస్తారు.
రెండో రోజు - సంక్రాంతి. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగలకు కొత్త శోభ తీసుకురావడానికి, వారం - పది రోజుల ముందే సున్నాలు వేయడం ; ఇళ్ళకు రంగులు ఆనవాయితీ.
చనిపోయిన పెద్దలను తులుచుకుని మొక్కుతారు. పిండివంటలు చేస్తారు. నలుగురికీ పంచిపెట్టి, తాము తిని సంబరంగా గడుపుతారు.
మూడోరోజు కనుము. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ - పక్షులూ పాలు పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు..
పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే, రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమును భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడి పందాలు, ఎడ్ల పందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంట విహారాలు, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.
ఉగాది
తెలుగు వారికి కొత్త సంవత్సరం మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి. ఈ రోజునే 'ఉగాది' అని కూడా అంటారు. సృష్టి మొదలైన రోజు కూడా ఇదేనని మన వారి నమ్మకం. "యూగాది" అనే పేరు కూడా దీనికి ఉంది.
ఈ పండగ ప్రత్యేకత - ఉగాది పచ్చడి.. ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. కొత్త బెల్లం, కొత్త చింత పండు పులుసు, మామిడి మొక్కలు, (కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా) చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు.
తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచులు సమ్మేళనంగా జీవితంలో కష్ట సుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. ఆరోగ్యానికి ఇది మంచిది.
మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం.
ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినడం చాలా చోట్ల ఆనవాయితీ.
పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి ఆలయ మంటపం మీద అంతా తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడేదీ, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.
శ్రీరామనవమి
రఘువంశ సుధాంబుధి అయినా రామచంద్రుని జన్మదినం చైత్ర శుద్ధ నవమి.
ఉగాది రోజు నుండి తొమ్మిది రోజులు నవమి వరకు నవరాత్రులుగా పరిగణించి రోడ్ల కూడలులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుతారు.
చివరి రోజున సీతారామ కళ్యాణం జరిపించి, పేదలకు అన్నదానం చేస్తారు. ఇళ్లల్లో యాధాశక్తి రాముని పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. రామకోటి రాసిన వారు, భద్రాద్రి వెళ్లి సమర్పిస్తారు.
వినాయక చవితి
ప్రతి ఏటా భాద్రపదంలో చవితి రోజున వచ్చే పండగ ఇది.
ఇది వినాయకుడనే శివపార్వతుల తనయుడి జన్మదినం.
పిల్లలకు ఇష్టమయ్యే పండగ ఇది. ఉదయాన్నే లేచి ప్రతి పూల వేటలో పడి, దండిగా సేకరించి తలకి స్నానం చేసి, శుచిగా వినాయక ప్రతిమ అమర్చి తెచ్చిన పూజ సామాగ్రి తో యధాశక్తి వినాయకుని అర్చిస్తారు.
కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారు. ఈ ఆవిరి వంటకాల్లోనే పోషక విలువలు నష్టపోని ఆరోగ్యానికి పనికొచ్చే విధంగా తయారు చేస్తారు.
ఇళ్ళలో నే కాక, వాడవాడలా గణేశుని నిలిపి ఇదే రీతిలో సామూహికంగా పూజ చేసి, చివరి రోజు (తొమ్మిదో రోజున) నిమజ్జనం చేస్తారు.
దసరా
ఆశ్వయుజ మాసం - శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దసరా లేక దేవీ నవరాత్రులు అంటారు.
ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి.
విద్యార్థులు పుస్తక పూజ, శ్రామికులు పనిముట్ల పూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులవుతారు.
దేవి మహిషాసుర మర్దని గా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితో, రాజులు ఈ శుభ ముహూర్తాన్నే పూర్వం ఎంచుకొనేవారిని పురాణాల్లో చెప్పబడింది.
కొన్ని ప్రాంతాల్లో దసరాకు బొమ్మల కొలువు ఒక వేడుకగా పెట్టే ఆచారం ఉంది.
దీపావళి
అశ్వయుజ మాస బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అనీ, ఆ మరుసటి రోజును దీపావళి అమావాస్య అనీ అంటారు.
ఇది పిల్లలకు - పెద్దలకు సరదా పండగ. తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించడం, పిండి వంటలతో భోజనం చేసి, సాయంత్రం కాగానే దీపాల్ని వరసుగా వెలిగించి, అనంతరం యధాశక్తి టపాకాయలు కాల్చడం ఈ పండుగకు ఆనవాయితీ.
నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ, మార్వాడిలకు ఇంకో విధంగా కూడా ప్రత్యేకమైనది. వారికి లక్ష్మీ పూజ దినం.
పాత ఖాతాలు మూసేసి, కొత్త పద్దులు ప్రారంభిస్తారు.
ఇవికాక - మన దేశం ప్రజాస్వామ్య దేశం, అన్ని మతాలకూ, కులాలకు సమాన ప్రాతినిధ్యం గల దేశం కనుక, క్రిస్మస్ - రంజాన్, బక్రిద్, నానక్ జయంతి వంటి పండగలూ ఉన్నాయి...
ముఖ్యమైన మన పండగల పట్టిక
తెలుగు నెలలు వచ్చే పండగలు
చైత్రం 1. ఉగాది, 2. శ్రీరామనవమి,
3. హనుమజ్జయంతి
వైశాఖం 1. బుద్ధ జయంతి
జ్యేష్ఠం 1. ఏరువాక పున్నమి
ఆషాఢం 1. తొలి ఏకాదశి
శ్రావణం 1. కృష్ణాష్టమి, 2. శ్రావణ పూర్ణిమ
భాద్రపదం 1. వినాయక చతుర్థి
ఆశ్వయుజం 1. విజయదశమి (దసరా), 2. నరక చతుర్దశి, 3. దీపావళి
కార్తీకం 1. భీష్మ ఏకాదశి, 2. కార్తీక పూర్ణిమ
మార్గశిరం 1. వైకుంఠ ఏకాదశి
పుష్యమి 1. భోగి, సంక్రాంతి, కనుము
మాఘం 1. రథసప్తమి, 2. శివరాత్రి
ఫాల్గుణం 1. హోళీ
- సత్యనారాయణ మూర్తి నేపా









కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి