![]() |
శ్రీలు పొంగిన జీవగడ్డ మన భారతదేశం(Bharata Desham). పాడిపంటలకు నిలయం, ప్రపంచంలో శాంతిని కోరే దేశం మనది.
భరతుడు అనే రాజు ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించాడు. అతని పేరుతో భారత దేశమయింది. వేదాలు పుట్టిన చోటిది. రకరకాల వంశాలవారు, జాతులవారు, భాషలవారు యీ దేశాన్ని పరిపాలించారు. రాజులు పోయారు. రాజ్యాలు గతించాయి. కానీ వారి సంస్కృతులు, సంప్రదాయాలు మన దేశంలో కలిసిపోయాయి. అజ్ఞానం తో నిండిన ప్రపంచానికి విజ్ఞానం అందించిన దేశమిది. ప్రాచీన నాగరికతతో వైభవంగా వెలుగొందిన దేశమిది.
మన దేశానికి ఉత్తర దిక్కున హిమాలయాలు అనే మంచుకొండలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం ఎల్లలుగా ఉన్నాయి.
అన్ని కాలాలలోనూ నీరు ప్రవహించే జీవనదులు, చిన్న నదులు, వాగులు, వంకలు ఎన్నో ఉన్నాయి. గంగ, యమున, సరస్వతి బ్రహ్మపుత్ర నదులు ఉత్తరభారతంలో ప్రవహిస్తే, గోదావరి, కృష్ణా, కావేరి నదులు దక్షిణ భారతంలో పారుతున్నాయి. ఈ నదీ జలాల వలన పాడి పంటలకు లోటు లేకుండా పోయింది. నర్మద, తపతి నదులు పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.
మనదేశంలో దట్టమైన అడవులు ఎన్నో ఉన్నాయి. ఈ అడవులు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడూ పచ్చగా ఉండే ''సతత హరితారణ్యా''లూ ఉన్నాయి.
మన దేశంలో ఎత్తెన పర్వతాలు కూడా ఉన్నాయి. హిమాలయాల తో పాటు వింధ్య, ఆరావళి పర్వతాలు కూడా ప్రఖ్యాతమైనవే. రాజస్థానును రెండుగా చీల్చిన ఆరావళి పర్వతాలలో "అబూ" పర్వతం చాలా గొప్పది.
మనదేశంలో ఖనిజ సంపదకు లోటు లేదు. బంగారం, రాగి, ఇనుము, వజ్రాల గనులు అనేకంగా ఉన్నాయి. ఈ ఖనిజాలు మన దేశంలోని సహజ సంపదలు. ఈ సంపదల కోసమే దండయాత్రలు చేసిన విదేశీయులూ ఉన్నారు. మనదేశంలో చమురు, సహజ వాయువుల నిక్షపాలు పుష్కలంగా ఉన్నాయి. బోంబాయి తీం ప్రాంతం, కృష్ణా, గోదావరి బేసిన్, అస్సాం ప్రాంతాలలో యివి అధికంగా ఉన్నాయి.
అనేక భాషల నిలయం మన దేశం. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, ఉర్దూ వంటి అనేక భాషలకు లిపి ఉంది. వీనితోపాటు లిపి లేని భాషలు కూడా ఉన్నాయి. ఇన్ని భాషలతోను, మరెన్నో సంస్కృతులతో ను, వివిధ మతాలతోనూ నిత్యనూతనంగా వెలుగొందుతూ "భిన్నత్వంలో ఏకత్వానికి" నిలయమని ప్రపంచానికి చాటుతోంది మన దేశం. ఆసేతుహిమాచలం వరకు భారత ప్రజలంతా ఒక్కటే. అందరి జీవన స్రవంతి ఒక్కటే. ప్రాంతమేదైనా,మతమేదైనా, రాష్ట్రమేదైనా, భాష ఏదైనా ప్రతి ఒక్కరూ భారతీయులే, మన కట్టూ, బొట్టూ, ఆచార వ్యవహారాలు ప్రపంచంలో మరెక్కడా కానరావు.
మనదేశంపై అనేకసార్లు విదేశీయులు దండయాత్రలు చేశారు. కొందరు మన సంపదలను దోచుకు పోయారు. కొందరు యిక్కడే వుండి పరిపాలన చేశారు. చివరకు మనదేశాన్ని ఆక్రమించిన వారు ఇంగ్లీషు వారు. వారి పాలనలో మనదేశ ప్రజలు అనేక కష్టాలు అనుభవించారు. చివరకు భారతదేశ ప్రజలంతా తిరుగుబాటు చేశారు. కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు మరిచి భారతీయులంతా సమైక్యంగా పోరాడారు. అనేకమంది జైళ్ళకు వెళ్లారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా పట్టుదల వీడక పోరాటం కొనసాగించారు. తెల్లవారిని వెళ్ళగొట్టగలిగారు. 1947 ఆగష్టు 15వ తేదీన మనదేశానికి స్వాతంత్ర్యం లభించింది. సర్దార్ వల్లభాయి పటేల్ నాయకత్వంలో చిన్న చిన్న సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో విలీనమై సమగ్ర స్వతంత్ర భారతదేశం ఏర్పడింది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, రాజాజీ గవర్నర్ జనరల్ పదవిని అలంకరించారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షునిగా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా భారత రాజ్యాంగం ఏర్పడింది. దీనితో సర్వ స్వతంత్ర సార్వభౌమికమైన గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఏర్పడింది. 1950 జనవరి 26న భారత రిపబ్లిక్ అవతరించింది. భారతీయుల చిరకాల వాంఛ నెరవేరింది.
మన దేశానికో జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. పైభాగంలో కేసరి వర్ణము, మధ్యలో తెలుపురంగు, క్రింద దట్టమైన ఆకుపచ్చరంగుతో కూడిన త్రివర్ణ పతాకము మన జాతీయ పతాకమయింది. 2:3 నిష్పత్తిలో వెడల్పు, పొడవులు గల యీ పతాకంలో మూడు రంగుల భాగాలూ సమానంగా ఉంటాయి. తెల్లటి మధ్య భాగంలోని కేంద్రస్థానంలో నేవీబ్లూ రంగులో చక్రం ఉంటుంది. ఇది అశోకుని ధర్మచక్రం చక్రం. చక్రంలో ఇరవై నాల్గు ఆకులు ఉంటాయి.
భారతదేశ చిహ్నం సారనాథ్ లోని అశోకుని స్తంభం పై భాగంలోని సింహతలాటము. ఈ చిహ్నం లో మూడు సింహాలు మాత్రమే కన్పిస్తాయి. నాల్గవది కన్పించదు. ఈ పీఠం అంచుపై మధ్యభాగంలో అశోకుని చక్రం ఉంటుంది. దానికి కుడివైపున ఎద్దు, ఎడమ వైపున గుర్రం బొమ్మలు ఉంటాయి, పీఠం కుడి ఎడమ చివరి భాగాలలో యితర చక్రాల స్థూల రూపాలు ఉంటాయి. పీఠం క్రింది భాగంలో "సత్యమేవ జయతే" అని దేవనాగరి లిపిలో చెక్కబడి వుంటుంది. ఈ సింహతలాటము సారనాథ్ మ్యూజియంలో భద్ర పరచబడింది.
రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రాజ్యాంగమునకు లోబడి పరిపాలింపబడుతున్న దేశం మనది. దేశ ప్రజలందరికీ ఒకేవిధమైన పౌరసత్వాన్ని ప్రసాదించింది మన రాజ్యాంగం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాన న్యాయం అనే సూత్రాలపై నిర్మింపబడింది మన రాజ్యాంగం. ప్రతి పౌరునికి కొన్ని హక్కులతో పాటు విధులను కూడా తెలియజేసింది. మన రాజ్యాంగం లిఖితమైనది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనది.
దేశకాల పరిస్థితులనుబట్టి అనేకసార్లు సవరించబడింది కూడా.
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశాధినేత. దేశ ప్రథమ పౌరుడు. సర్వ సైన్యాధ్యక్షుడు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల మెజారిటీ నాయకుణ్ణి దేశ ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తాడు. దేశ ప్రధాని సూచించిన వారిని వివిధశాఖల మంత్రులుగా రాష్ట్రపతి నియమిస్తాడు. వీరందరు ఉమ్మడిగా పరిపాలనా బాధ్యతలను స్వీకరిస్తారు. దేశ పరిపాలన మూడు విభాగాలుగా పనిచేస్తుంది. మొదటిది కార్యనిర్వాహక విభాగం. దీని అధిపతి రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి, ప్రధాని, యితర మంత్రులు యీ విభాగంలో ఉంటారు. రెండవ విభాగము లెజిస్లేచర్. దీనిని పార్లమెంటు అంటారు. దీనిలో లోక్ సభ, రాజ్యసభ అని రెండు సభలుంటాయి. మూడవది న్యాయ విభాగం. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ధర్మ శాసనం ఉంటుంది. దీనిలో ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురికి మించకుండా ఇతర న్యాయమూర్తులూ ఉంటారు. రాష్ట్రపతి పంపే విషయాలపై సలహాలు యిచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.
భారత రాజ్యాంగం ప్రకారం సామ్యవాద పద్ధతిలో పారిశ్రామికవిధానం ఆమోదింపబడింది. భారీ పరిశ్రమలను అభివృద్ధి పరచాలని, ప్రభుత్వ రంగ విస్త రణను, సహకార రంగాభివృద్ధిని, కుటీర పరిశ్రమల ప్రోత్సాహాన్ని ఆమోదించింది.
అంతరిక్ష పరిశోధనకు జాతీయ కమిటీని ఏర్పాటు చేయడంతో భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైంది.1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పాటై, మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19న ప్రయోగించింది. భాస్కర - 1, భాస్కర - 2 ప్రయోగించిన తరువాత "రోహిణి" ఉపగ్రహాన్ని మనదేశంలో శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. అంతరిక్షంలో గడిపిన తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మ గణుతికెక్కాడు. అంతరిక్ష విజ్ఞానంలో యిదొక స్వర్ణ ఘట్టం. ఆ తరువాత ఎన్నెన్నో విజయాలతో ముందుకు సాగిన మన అంతరిక్ష పరిశోధన ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహంతో అగ్రదేశాల సరసన సగర్వంగా నిలిచింది.
అణశక్తి సామర్థ్యంలోనూ మనదేశం అగ్రదేశాల సరసన సగర్వంగా నిలబడిందీనాడు. 1974 మే నెల 18న రాజస్థాన్ లోని ప్రోఖ్రాన్ వద్ద జరిపిన ప్రథమ న్యూక్లియర్ టెస్ట్ తో ప్రారంభమైన మన అణుశక్తి జైత్రయాత్ర 1998 మే 11న రాజస్థాన్ లోని ప్రోఖ్రాన్ లో వరుసగా జరిపిన మూడు న్యూక్లియర్ టెస్టులతో భారతదేశం కూడా అణుశక్తిగల అగ్రరాజ్యాల సరసన నిలబడగలిగింది.
దేశ ప్రణాళికల ప్రధాన లక్ష్యాలలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఒకటి. సన్నకారు రైతుల అభివృద్ధికి పాటుపడడం, కూలీలకు పనులు కల్పించడం, ఎడారులను, బంజర్లను పంట భూములుగా అభివృద్ధి పరచడం గ్రామీణాభివృద్ధి లక్ష్యాలు. ఇరుగు పొరుగున ఉన్న దేశాలతో మైత్రీ భావంతో మెలగాలన్నదే మన విదేశాంగ విధానం. సర్వమానవ సౌభాగ్యంలోనే ప్రపంచ సౌభాగ్యం వుందని అందరూ గుర్తించిన రోజు సర్వ జగత్తు నిత్యకల్యాణం పచ్చ తోరణంగా వెలుగ గలదు.
ఇటువంటి మహోన్నతమైన దేశంలో పుట్టడం నిజంగా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యఫలమే భారతీయుడిగా జన్మించడం. ఎందరో మహానుభావుల త్యాగఫలం యీ దేశం. "జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అన్నట్లు మనదేశం స్వర్గం కంటే గొప్పది. మహత్తరమైన భూమి ఈ ప్రపంచంలో ఏదైనా వుంటే అది మన పవిత్ర భారత భూమే. ఈ గడ్డపై జన్మించినందుకు గర్వించి తీరాలి.
మేరా భారత్ మహాన్
- జైహింద్ -
-సత్యనారాయణ మూర్తి నేపా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి