Breaking

21, జులై 2020, మంగళవారం

భారతీయ ఋషులు - Indian Sages - Digital Yuvatha

                  భారతీయ ఋషులు

భారతీయ ఋషులు - Indian Sages - Digital Yuvatha
Indian Sages

విజ్ఞానానికి పుట్టినిల్లు భారతదేశం. మన వేదాల గొప్పతనం మాటల్లో చెప్పలేనిది. ఖగోళవిశేషాలెన్నో అందులో ఉన్నాయి. విమానం గురించి క్రీ.పూ. 1500 లోనే రాశారు. కౌటిల్యుని 'అర్థశాస్త్రం' ప్రపంచంలోనే ఆ కోవలో తొలిరచన. లెక్కలకు సంబంధించి ' పై ' విలువ ను కనిపెట్టిందెవరు? ఆర్యభట్టు అనే భారతీయ మేధావి. శస్త్రచికిత్స వివరాలను పుస్తకరూపంలో రాసిన తొలి వ్యక్తి చరకుడు. సుశ్రుతుడు కూడా గొప్ప ఆయుర్వేద పండితుడు. భాస్కరాచార్యులు, వరాహమిహురుడు గొప్ప ఖగోళపండితులు.అన్ని శాస్త్రాల్లో భారతదేశానిదే పైచేయి.

బుద్ధుడు: ప్రపంచస్థాయి మతసంస్కర్తల్లో ఒకరు బుద్ధుడు. క్రీ. పూ.‌ 563 లో లుంబినిలో పుట్టాడు. ఆయన అసలు పేరు సిద్ధార్థుడు 'కపిలవస్తు'కు రాజు కావలసిన వ్యక్తి 'యోగి' అయ్యాడు. భార్య యశోధరను, బిడ్డరాహుల్ ని తన 29న ఏట వదిలి సంఘంలో కలిశాడు. సత్యం- శాంతి అనే వాటికోసం ఊరూరా తిరిగేవాడు. ఒకరోజు గయ అనే ఊరిలో బోధి చెట్టుకింద కూర్చొన్నాడు. అప్పుడే జీవితం అంటే ఏమిటో బోధపడింది. దాని ఫలితమే బుద్ధునిగా అవతారం!

 వారణాసి (కాశీ) దగ్గర సారనాథ్ లో తొలి ప్రసంగం చేశాడు బుద్ధుడు. 'జీవితంలో కష్టాలకీ, కన్నీళ్ళకీ కోరికలే కారణం'. ఇది బుద్ధుని నుంచి అందరూ నేర్చుకునేది. దుఃఖం రాకుండా ఉండటానికి 'అష్టాంగ మార్గం' చెప్పాడు బుద్ధుడు.

1. నమ్మకం తొలి మెట్టు,

2. సక్రమ ఆలోచన,

3. మంచి మాట,

4. సరైన చర్య (పని చేయటం- విధి నిర్వహణ),

5. సరైన జీవనం,

6. సరైన సామర్థ్యం,

7. జ్ఞాపకశక్తి,

8. ధ్యానం.

ప్రజలందరూ సుఖంగా ఉండేందుకు తపించాడు బుద్ధుడు. ఆనాటి సంఘంలోని ఆచారాలను తప్పుపట్టాడు. మూఢనమ్మకాలు ఉండకూడదన్నాడు. 'కులం' అనే భావం హిందూ సమాజంలో ఉండరాదన్నాడు. సత్యం, శాంతి, మానవత్వం, సమానత్వం అలవడాలన్నాడు. జంతుబలులను వ్యతిరేకిస్తూ 'అహింస' పరమధర్మంగా బౌద్ధం స్థాపించాడు.

శంకరాచార్యుడు: భారతదేశపు మరో పుణ్యపురుషుడు జగద్గురు శంకరాచార్య. శైవం - వైష్ణవం అని ఆ రోజుల్లో రెండు మతాలు ఉండేవి, ఎవరికి వారే గొప్ప! ఈ కారణంగా తగువులాడుకునేవారు. ఆ స్థితిలో 'అద్వైతం' ప్రారంభించారు శంకరాచార్య. హిందూమత ఉద్ధారకుడైన శంకరాచార్య కాలడి (కేరళ) లో పుట్టారు. శివగురువు - ఆర్యాంబ అనే శివభక్తుల పుణ్యఫలం 'శంకరాచార్య'. నందననామ సం" వైశాఖ శుద్ధ పంచమి ఆదివారంనాడు జన్మించారు. పసితనంలోనే వేదాలను, వేదాంగాలను నేర్చుకున్నారు శంకరాచార్య. యోగశాస్త్రం కూడా ఒంట పట్టింది. అష్టసిద్ధుల్లో ఆరితేరినవాడు శంకరుడు. సామాన్యుడిలాగా భిక్షాటన చేసేవాడు. చిన్ననాటనే సన్యాసం స్వీకరించాడు. జీవితమంతా పెళ్లి అనే మాటకు చాలా దూరంగా ఉన్నాడు. గోవింధ భగవత్పాదుల దగ్గర శిష్యుడిగా చేరారు శంకరుడు. నాలుగు వేదాలు క్షుణ్ణంగా గ్రహించాడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఉపనిషత్తుల గురించి కూడా తెలుసుకున్నాడు.

బ్రహ్మసూత్రాలకు భాష్యం (వ్యాఖ్యానం) రాసిన గొప్పమేధావి శంకరుడు. కాశీకి వెళ్ళి 'భజగోవింద' శ్లోకాలు చదివాడు. భగవద్గీత అర్థం వివరించారు శంకరాచార్యులు. విష్ణువుకి ఉండే వెయ్యి పేర్లు (సహస్రనామాలు) కు భాష్యం రాశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన తిరిగారు. రెండుసార్లు భారతదేశమంతా సంచరించారు. శివ - కేశవులకు తేడాలేదంటూ 'అద్వైతం' ప్రచారం చేశారు. హిందూమతాన్ని గొప్పగా ఉద్ధరించారు. లక్ష్మీ నరసింహ స్తోత్రం... మరెన్నో రచించారు.

శ్రీరామకృష్ణ పరమహంస: వంగ (బెంగాల్) దేశంలో హుగ్లీ జిల్లా దేవేపూర్ లో 1836లో ఫిబ్రవరి 18 పుట్టారు. క్షుదిరాముడు, చంద్రమణీదేవి అనే రామభక్తులకు పరమహంస జన్మించారు. బాల్యంలో పరమహంస పేరు గదాధరుడఏడేళ్ళకే తండ్రి మరణించాడు. దాంతో దుఃఖం పొంగుకొచ్చింది. పక్క ఊరికి వెళ్లి సాధువులు చెప్పేవి శ్రద్దగా వినేవాడు. బడిలో చేరాడు. ఓసారి 'రాధిక' వేషం వేశాడు. మొదట్నుండీ భక్తి ఎక్కువ. ఆ కారణంగా దక్షిణేశ్వరం కాళికాలయంలో పూజారి అయ్యాడు. అప్పటికి ఆయనకు 19 సంవత్సరాల వయసు. కాళికామాత రాతి విగ్రహంతో తప్ప మరెవరితో మాట్లాడేవాడుకాడు. ఉండుండి ధ్యానంలోకి వెళ్ళేవాడు. ఎవరు పిలిచినా పలికేవాడు కాదట. అర్చకునిగా ఉన్న పరమహంస ఒకరోజు తోతాపురి దగ్గరకెళ్ళాడు. ఆ యోగి దగ్గర సన్యాసం స్వీకరించాడు. పరమహంస తోతాపురికి ప్రియశిష్యుడు అయ్యాడు. నెలలో కొన్ని రోజులు అన్నపానీయాలు ముట్టేవాడు కాడు. ధ్యానంలో మునిగేవారు శ్రీ రామకృష్ణ పరమహంస. పరమహంస 'సమాధి' యోగాలకు గురువు ఆశ్చర్యపోయారు. పరమహంస తనభార్య శారదాదేవిని కాళీదేవి భక్తురాలిగా మార్చారు. ఎందరెందరినో శిష్యులుగా చేసుకున్నారు. సర్వమత సమానతను చాటారు. అదే దేవుడిని చేర్చే దగ్గర మార్గం అన్నారు. 1886 ఆగస్టు 16న మృతిచెందారు. శ్రీరామకృష్ణుని ఆశయాల మేరకు 'బేలూరు' లో ఓ మఠం వెలిసింది. అదే 'రామకృష్ణ మఠం'. ప్రపంచవ్యాప్తంగా సంఘసేవ చేస్తుంది ఈ మఠం.

వివేకానంద స్వామి: 1863 జనవరి 12న విశ్వనాథుడు - భువనేశ్వరిలకు జన్మించారు. బిడ్డ పుట్టగానే 'వీరేశ్వరుడు' అని పేరు పెట్టారు. తర్వాత 'నరేంద్రనాధ్' అనిపించుకున్నాడు. 'వివేకానందుని'గా స్థిరపడ్డాడు. నరేన్ తండ్రి కలకత్తాలో గొప్పన్యాయవాది. వివేకానందునికి చిన్నవయస్సు నుంచి భక్తి ఎక్కువ. తల్లి 'భారతరామాయణా'లను చెప్పేది. ఏడేళ్ళకే వాటిలోని కొన్నింటిని కంఠస్తం చేయగలిగాడు. ఎనిమిదేళ్ళకే సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నాడు. ఆటపాటల్లో కూడా చురుకైనవాడు. వివేకానందుని ఏడేళ్ళ వయసులో ఈశ్వరచంద్ర విద్యాసాగరుని పాఠశాలలో చేరాడు. మూడుసంవత్సరాల పాటు చదవాల్సిన ఉన్నతవిద్యను ఏడాదికే పూర్తి చేశాడు.ప్రథముడిగా నిలిచి శభాష్ అనిపించుకున్నాడు. వివేకానందుడు తన 16వ సంవత్సరంలో కళాశాలలో ప్రవేశించాడు. పెళ్లి మీద మనసులేదు. అందరిలాంటి జీవితం అతనికి అక్కరలేదు. అందుకే పరమహంస ఆశ్రమానికి వెళ్ళాడు వివేకానందుడు. అతని మాటతీరు పరమహంసకు నచ్చింది. కొద్ది కాలానికే ప్రియశిష్యుడయ్యాడు వివేకానందుడు. కొన్ని గీతాలను గురువుగారికి చక్కగా వినిపించేవాడు. పరమహంస తదనంతరం 'రామకృష్ణమఠం' స్థాపించాడు వివేకానందుడు. భారతదేశం అంతటా పర్యటించాడు.భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలనుకున్నాడు. 1893 లో మే 31న విదేశాలకు బయలుదేరాడు వివేకానందుడు. చైనా జపాన్ హాంకాంగ్ లలో పర్యటించారు వివేకానందుడు. అమెరికా కూడా వెళ్ళారు. చికాగో నగరంలో ఒక సభలో గొప్పగా ఉపన్యసించారు ఆ సర్వమత సభలో 'డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్' అని ప్రసంగం మొదలుపెట్టారు. ఆ ధోరణి అందరినీ ఆకట్టుకుంది. ఆ సోదర భావానికి అందరూ ఆనందించారు. వివేకానందుడు లండన్ కూడా వెళ్ళారు. మాక్స్ ముల్లర్ అనే గొప్పపండితుడు స్వామికి తారసపడ్డారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మారు. యువతరానికి సందేశం ఇచ్చారు. భారతీయులు ఐక్యంగా ఉండాలన్నారు. భారతీయ వేదవిజ్ఞానం అందరూ తెలుసుకోవాలని ప్రబోధించారు. 1902 జూలై 4న అమరుడయ్యాడు. నేటికీ స్వామివివేకానంద ఎంతో మందికి స్పూర్తి.

పోతులూరి వీరబ్రహ్మం: భారతీయ యోగులలో వీరబ్రహ్మం ఒకరు. జరగబోయేదానిని తన మేధాశక్తితో ఆలోచించారు. కాలజ్ఞానం పేరుతో రచనచేశారు. బతికుండగానే సమాధిలోకి వెళ్ళారు. కాబట్టే మహా యోగిపుంగవుడు. అసలు పేరు వీరప్ప. బ్రహ్మాండపురంలో పుట్టారు వీరబ్రహ్మం. కన్నవారు పకృతమ్మ,పూర్ణయాచారి. వీరబ్రహ్మం తల్లిదండ్రులు చనిపోవడంతో వీరపాపమ్మ - వీరభోజచారి దంపతులు ఇంట పెరిగాడు. చిన్నప్పటి నుంచి వీరబ్రహ్మనికి భక్తి మెండు. చుట్టుపక్కల గుళ్లుగోపురాలు చూసి వచ్చాడు. బనగానపల్లె లో మకాం వేశాడు. పశువుల కాపరిగా ఓ చోట చేరాడు. వీరబ్రహ్మాన్ని ఆదరించిన ఆదంపతులు అచ్చమ్మ, వెంకటరెడ్డి. పశువులను ఓ చోట వదిలి కొండ గుహలోకి వెళ్ళేవాడు. ధ్యానం చేసేవారు. అంటే కళ్లుమూసుకుని కూర్చోనేవాడు. తాటి ఆకులమీద రోజూ 'కాలజ్ఞానం' రాసేవాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించేవాడు. వాటిని తాటి ఆకులమీద రాసేవాడు. బ్రహ్మంగారి యోగసాధన ఎందరినో ఆకర్షించింది. అన్నాజయ్య బ్రహ్మం కాలజ్ఞానాన్ని ఊరురాతిరిగి చెప్పేవాడు. మరోప్రియశిష్యుడు 'సిద్ధప్ప'. బ్రహ్మంగారికి కులమత బేధాల పాటింపు లేకపోవడం ఎన్నదగింది. కక్కయ్య అనే హరిజనుడ్ని కూడా తన శిష్యుడిగా చేసుకున్నాడు. తన చివరిరోజుల్లో కందిమల్లయ్య పల్లెకు చేరారు వీరబ్రహ్మం. అక్కడే జరగబోయేది చెప్పేవారు. సజీవ సమాధి అయ్యారు. బ్రతికుండగానే ఆహారశ్వాసలు ఆపివేసి చనిపోవడమే 'సమాధి యోగ'. తర్వాత బ్రహ్మంగారి మఠం ఏర్పాటయింది.


                                            - సత్యనారాయణ మూర్తి నేపా


1 కామెంట్‌:

  1. చాలా మంచిగా అనువాదించావు... నాకు ఒక్కటి బాగా నచ్చింది. అది.....


    మన మాతృ భాష అయిన తెలుగుని అందరికీ చాటి చెప్పడం...

    రిప్లయితొలగించండి